సాగునీటి విస్తరణకు మాస్టర్ ప్లాన్
ఖమ్మం జిల్లాకు కొత్త ఆయకట్టు రూట్ మ్యాప్
లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనక ప్రణాళికలు
వ్యవసాయం–సంక్షేమానికి వేల కోట్ల పెట్టుబడులు
వ్యవసాయ రంగానికి రూ.74,163 కోట్లు ఖర్చు
పేదల సంక్షేమానికి రూ.47,710 కోట్ల వ్యయం
రైతు, మహిళ, పేదలే ప్రభుత్వ ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొదుమూరు–వందనం లిఫ్ట్ రెండో దశకు శంకుస్థాపన
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనకు ప్రజా ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్ల 75 లక్షలతో 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన కొదుమూరు–వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు, వందనం గ్రామం ఎస్సీ కాలనీలో రూ.1 కోటి 85 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల పనులకు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వందనం–పుట్టకోట జెడ్పీ రోడ్డు వరకు రూ.3 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

గత హామీల అమలు చేస్తున్నాం..
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, చింతకాని మండలానికి చుట్టుపక్కల నాగార్జున సాగర్ నీళ్లు ఉన్నప్పటికీ కొదుమూరు, వందనం రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. రైతుల ఆవేదనను గమనించి 2009లో ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత కొదుమూరు–వందనం లిఫ్ట్ పనులు పూర్తి చేసి, 2013 ప్రాంతంలో 2,500 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా ఎండాకాలంలో కూడా నీటి లభ్యత ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొదుమూరు–వందనం లిఫ్ట్ రెండో దశకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 2 లక్షల 79 వేల ఎకరాల ఆయకట్టు కల్పించామని, ఇప్పుడు అదనంగా లక్షా 98 వేల ఎకరాల ఆయకట్టు సాధనకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1 లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జవహర్ లిఫ్ట్ పరిధిలో 33,250 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23 వేల ఎకరాలు, కొదుమూరు–వందనం లిఫ్ట్ ద్వారా 2,500 ఎకరాలు, మంచుకొండ లిఫ్ట్ ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందించే పనులు కొనసాగుతున్నాయని వివరించారు.


రైతు సంక్షేమమే లక్ష్యం
రైతులకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత రెండేళ్లలో వ్యవసాయ రంగంపై రూ.74,163 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత ఫించన్, వడ్డీ లేని రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలకు రూ.47,710 కోట్లు వెచ్చించామని తెలిపారు. 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లతో మంజూరు చేసి, లబ్ధిదారులకు ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు 100 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు చేశామని, మధిరలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. మధిర అసెంబ్లీ పరిధిలో కట్టలేరు, మున్నేరు, వైరా నదుల జలాలు వృథా కాకుండా ఆనకట్టలు నిర్మిస్తున్నామని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ పంపిణీ చేశామని, 96 లక్షల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, రూ.35 కోట్ల వ్యయంతో కొదుమూరు–వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు శంకుస్థాపన చేశామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తక్కువ విద్యుత్ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీరు పొలాలకు చేరేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.


