భూములిప్పిస్తామని భారీ మోసం
భూదాన్ భూముల పేరు చెప్పి పేదలకు ఎర
ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు
38 మంది బాధితుల నుంచి రూ.54.13 లక్షలు సేకరణ
నకిలీ రసీదులిచ్చి అమాయకులను నమ్మించిన ముఠా
న్యాయం చేయాలంటూ ఖమ్మం టౌన్ ఏసీపీకి బాధితుల ఫిర్యాదు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన ఖమ్మం అర్బన్ పరిధిలో బయటపడిందని టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో ఉన్న భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో అక్రమార్కులు ప్రజలను మోసం చేశారు. ఈ వ్యవహారంలో మోసపోయిన 38 మంది బాధితులు గురువారం టౌన్ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి, మొత్తం రూ.54.13 లక్షలు దోచుకున్నట్టు ఏసీపీ తెలిపారు.
నకిలీ రసీదులతో మోసం బహిర్గతం
బాధితులందరూ పోలబోయిన ముత్తయ్యకు నగదు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. వారు అందించిన రసీదులను పరిశీలించగా, భూదాన్ వినోభాబవే వెల్ఫేర్ సొసైటీ పేరుతో పాటు యూ సీసీ ఆర్ ఎల్ ఐ (యం ఎల్) పార్టీ, పి.అరవింద్ పేర్లతో నకిలీగా ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రసీదులు ఇచ్చినట్టు తేలిందని ఏసీపీ రమణమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలబోయిన ముత్తయ్యను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసు లోతైన విచారణ కోసం ఖానాపురం హవేలీ పోలీసులు నిందితుడిని కస్టడీకి కోరినట్లు తెలిపారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.


