సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్
12 మందికిపైగా మావోయిస్టులు హతం
మృతులంతా కొంటా ఏరియా కమిటీ సభ్యులే
ఏకే–47లు సహా భారీగా ఆయుధాల స్వాధీనం
కొనసాగుతున్న కాల్పులు..
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. సుక్మా జిల్లా కొంటా డివిజన్ పరిధిలోని కిస్తారామ్ అడవుల్లో శనివారం భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతులంతా కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక సభ్యులుగా భద్రతా వర్గాలు నిర్ధారించాయి. ఈ ఘటనతో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడుతో పాటు కమిటీ సభ్యుడు సచిన్ ముగ్దూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పలువురు సీనియర్ కేడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో 3 ఏకే–47 రైఫిళ్లతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కూంబింగ్ ఆపరేషన్‌లో కాల్పులు
కిస్తారామ్ అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న నిఘా సమాచారం మేరకు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ నేతృత్వంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించడంతో… జవాన్లు ప్రతికాల్పులకు దిగారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరగగా, మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్‌కౌంటర్ అనంతరం పరిసర అటవీ ప్రాంతాల్లో మరికొందరు మావోయిస్టులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సుక్మా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలకు ఇది భారీ ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.


