కాకతీయ, నేషనల్ బ్యూరో: ఆఫ్ఘనిస్తాన్ భారీ భూకంపాలతో వణికిపోయింది. ఆదివారం అర్థరాత్రి దేశంలో వరుసగా భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలు ఢిల్లీ NCR వరకు తాకాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం 6.3 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ఘోర విపత్తు కారణంగా ఇప్పటి వరకు 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. మరో 15వందల మంది వరకు గాయపడినట్లు పేర్కొంది.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం..నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీక్రుతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 కు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పోస్టులు పెడుతున్నారు.
భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ పోస్టులో తెలిపారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు తెలిపారు. ఆఫ్టానిస్తాన్ లోని కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్ లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయన్నారు.
వారి జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వ్రుద్ధులు తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. బాధితుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని..అసమర్థ తాలిబాన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదన్నారు. ఈ సమయంలో కునార్ ప్రజలకు సాయం అత్యవసరమని తెలిపారు. మానవతా సంస్థలు స్పందించి బాధితులను ఆదుకోవాలన్నారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని కోరారు. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని పోస్టులో పేర్కొన్నారు.


