కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు జ్ఞానం పంచాల్సిన పాఠశాలలోనే మత్తు పదార్థాల తయారీ జరుగుతుందని ఎవరైనా ఊహించారా? కానీ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్ పై ఈగల్ టీమ్ నిర్వహించిన ఆపరేషన్‌లో నిజంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, స్కూల్ డైరెక్టర్ స్వయంగా విద్యాసంస్థను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చినట్లు తెలుస్తోంది. స్కూల్ ఆఫీస్ రూమ్‌తో పాటు మరో రెండు గదుల్లో మత్తు పదార్థాలను తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు దాడి చేసి 7 కేజీల ఆల్ఫాజోలం, సుమారు రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ రాకెట్ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉండాల్సిన స్కూల్‌ను అక్రమ వ్యాపారం కోసం వినియోగించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చదువుకునే వాతావరణంలో ఇలాంటి దందా జరుగుతుందని ఊహించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి మత్తు పదార్థాల ముప్పు ఎంత లోతుగా వ్యాపించిందో చూపించింది. యువత భవిష్యత్తును రక్షించడానికి ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.


