సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు
కాకతీయ, కరీంనగర్ : సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరను ఘనంగా నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. శనివారం రేకుర్తిలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్ స్థలాల చదును, తాత్కాలిక మరుగుదొడ్లు, దుకాణ సముదాయాల కోసం కేటాయించిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్, త్రాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, క్యూలైన్లు, మెడికల్ క్యాంపులు, భద్రతా చర్యలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే జాతరను భక్తులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు


