దేవునిపై రాజకీయం చేయవద్దు.
రైతుల హక్కులు కాపాడుతాం.
మంత్రి సీతక్క హామీ..!!
కాకతీయ, ములుగు: ములుగు జిల్లా పరిధిలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. ములుగు ప్రాంతం బ్యూటిఫికేషన్, పార్కింగ్ సదుపాయాలు, అడవి సంరక్షణతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం చుట్టూ పర్యాటక అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం భక్తుల సౌకర్యం కోసం పార్కింగ్ ప్రదేశాలు పెంచుతున్నాం అని, రైతుల భూములపై ఎటువంటి అన్యాయం జరగదు అని,గతంలో ఇచ్చిన పరిహారం మాదిరిగానే ఈసారి కూడా రైతులకు న్యాయం చేస్తాం అని, ఎక్కడ ఎక్కడ పార్కింగ్ అవసరం ఉంటుందో ఆ భూములను గుర్తించి పార్కింగ్ ను ఏర్పాటు చేస్తామని, దేవునిపై రాజకీయాలు చేయవద్దని, మేడారంలో పూజారుల ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ పనులు జరుగుతాయి అన్నారు.
అలాగే ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కలిసి మేడారం అభివృద్ధికి డిపీఆర్ (వివర ప్రాజెక్ట్ నివేదిక) సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సీఎం ఆమోదం తర్వాత తుది మాస్టర్ ప్లాన్ బయటకు వస్తుంది అని,ఈ జాతరతో తెలంగాణలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుంది అని తెలిపారు. రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు రావడంతో ములుగు జిల్లాకు పర్యాటకంగా మరింత గుర్తింపు వస్తుందని, ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీ వంటి ప్రాజెక్టులు కూడా ముందుకు సాగుతున్నాయని మంత్రి వివరించారు.
స్థానిక ప్రజలు, పూజారులు, రైతులు అందరూ సహకరించమని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రతిష్టకు భంగం కలగకుండా అన్ని పనులు జరుగుతాయి అని,భక్తుల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడతాం అని మంత్రి స్పష్టం చేశారు.


