బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
ఎమ్మెల్యే గంగుల సమక్షంలో 200 మంది కండువా కప్పుకున్న నేతలు
నగర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం : ఎమ్మెల్యే కమలాకర్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రెండవ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. రెండవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి నూతి చందు, మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో తీగలగుంటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య తమ అనుచరులు సుమారు 200 మందితో కలిసి శనివారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ కొత్తగా చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఆయన నివాసంలో జరిగింది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు జరగడం కరీంనగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గంగుల కమలాకర్ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో రెండవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి నూతి చందును భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అదే రోజు రాంనగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని గంగుల కమలాకర్, మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ భవనం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో నిర్మించబడిందని తెలిపారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కరీంనగర్ నగరానికి సుమారు రూ.1600 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును నిలిపివేయడం బాధాకరమని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు గంగుల కమలాకర్‌ను వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


