అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మృతురాలి భర్త స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌కు మాజీ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు.స్థానికుల కథనం ప్రకారం…పట్టణంలోని కోరుట్ల బస్ స్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంగల రోహిణి (32) బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు సమాచారం.కథలాపూర్ మండలానికి చెందిన రోహిణిని ఎనిమిదేళ్ల క్రితం దినేష్‌తో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.గత కొంతకాలంగా దంపతుల మధ్య వైవాహిక విభేదాలు తీవ్రంగా ఉన్నాయని తెలుస్తోంది. దినేష్ వివాహేతర బంధం పెట్టుకుని రోహిణిని మానసికంగా వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.బుధవారం తెల్లవారుజామున రోహిణి ఆత్మహత్య చేసుకుందని చెప్పుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే రోహిణి మెడపై గాయాలున్నాయని ఆమె బంధువులు ఆరోపిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఘటనాస్థలికి పోలీసులు సమాచారం అందుకున్న టౌన్ సీఐ వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు నెలల క్రితమే తొలగింపు…
దినేష్, రోహిణిల మధ్య కలహాలు తీవ్రరూపం దాల్చడం, వివాహేతర బంధం అంశం వెలుగులోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ముందస్తుగా స్పందించినట్లు సమాచారం. తన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న దినేష్‌ను రెండు నెలల క్రితమే తొలగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


