కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా మావోయిస్టుల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఆయుధాలు వదిలి చర్చలకు రావాలా? లేకపోతే పోరాటం కొనసాగించాలా? అన్న దానిపై వాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టులతో ఇకపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టంచేశారు. “చర్చలకు అవకాశం లేదు, వాళ్లు చేయాల్సింది ఒక్కటే – ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవడం” అని హోంమంత్రి స్పష్టం చేశారు. లొంగిపోయే మావోయిస్టులను ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారికి పునరావాసం కల్పించడంతో పాటు అన్ని రకాల ప్రయోజనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, 2026 మార్చి 31 నాటికి దేశం పూర్తిగా మావోయిస్టు రహితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. “మావోయిస్టులు చర్చలు జరపాలని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వారితో మాట్లాడటానికి ఏమీ మిగల్లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై కూడా అమిత్ షా దృష్టి సారించారు. బస్తర్ సహా ప్రభావిత జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి కృషి చేస్తున్నాయని చెప్పారు. “శాంతిని భంగం చేసే వారిని భద్రతా బలగాలు తగిన రీతిలో ఎదుర్కొంటాయి” అని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యల ప్రకారం, ప్రభుత్వం ఇక మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా లేదు. వాళ్లు లొంగితేనే పునరావాసం, ప్రయోజనాలు లభిస్తాయి. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టుల ప్రభావం నుండి పూర్తిగా విముక్తమవుతుందని హోంమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.


