మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి
సిపిఐ నేతలు
కాకతీయ, గోదావరిఖని : ప్రజా, కార్మిక హక్కుల సాధన కోసం మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపెల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి బస్‌జాతా ఆదివారం గోదావరిఖనికి చేరుకోవడంతో సింగరేణి సిబ్బంది, సిపిఐ నగర సమితి గంగానగర్ వద్ద ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా బస్‌జాతాను నగర చౌరస్తా వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.మావోయిస్టులు, వామపక్షాలు విడిగా పోరాటాలు చేయడంతో మతోన్మాద శక్తులు లాభపడుతున్నాయని,త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు మతోన్మాదులవి అని వ్యాఖ్యానించారు. వందేళ్లుగా సిపిఐ పార్టీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజల విశ్వాసం పొందిందని, నిజాం వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ సాయుధ సంగ్రామం, సింగరేణి కార్మిక ఉద్యమాలకు సిపిఐ చరిత్రాత్మకంగా ముందుండిందని తెలిపారు.ప్రభుత్వాలు కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టు పెడుతూ, ధరల పెరుగుదలు, నిరుద్యోగం, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అర్బన్ నక్సలైట్ పేరుతో అరెస్టులు, ఎన్‌కౌంటర్లను ఖండించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షత వహించారు. రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్, మణికంఠ రెడ్డి, మారుపాక అనిల్, పల్లె నరసింహ, కన్నం లక్ష్మీనారాయణ, మడ్డి ఎల్లా గౌడ్, గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, కనకరాజు, ఓదెమ్మ, ప్రీతం, సూర్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



