యువ దర్శకులకు మంచు విష్ణు బంపర్ ఆఫర్
సంక్రాంతికి అదిరిపోయే కానుక
కాకతీయ, సినిమా :టాలెంట్ ఉన్నా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ దర్శకులకు నటుడు–నిర్మాత మంచు విష్ణు గొప్ప అవకాశాన్ని అందించారు. ఇటీవల కన్నప్ప చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విష్ణు, ఇప్పుడు కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. తన సొంత బ్యానర్ అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఓ భారీ షార్ట్‌ఫిలిం పోటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ – సీజన్ 1 పేరుతో నిర్వహించనున్న ఈ పోటీ లక్ష్యం ఒక్కటే… కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేయడం. ఈ కాంటెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ దర్శకులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు. కేవలం షార్ట్‌ఫిలిం పోటీగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో సినిమా అవకాశాలకు ఇది ఒక గేట్‌వేగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో దాగి ఉన్న కథనశక్తి, దర్శకత్వ ప్రతిభను వెలికి తీయడం, వారికి సరైన ప్లాట్‌ఫామ్ కల్పించడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన ప్రతిభావంతులకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భవిష్యత్ ప్రాజెక్టుల అవకాశాలు కల్పించే యోచన కూడా ఉందని సమాచారం. పోటీకి సంబంధించిన అర్హతలు, గడువులు, బహుమతులు, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో యువ దర్శకుల్లో ఉత్సాహం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో కొత్త రక్తానికి పెద్ద పీట వేస్తూ, మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా యువతకు సంక్రాంతి కానుకగా మారిందని సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.


