కాకతీయ, సినిమా డెస్క్: తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సాయం చేశారని సినీనటి మంచు లక్ష్మీ అన్నారు. రజనీకాంత్ చిత్రపరిశ్రమకు వచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు.
తన తండ్రి, రజనీకాంత్ మంచి స్నేహితులని..చిన్నప్పుడు పుట్టిన రోజులకు ఆయన తప్పకుండా వచ్చేవారంటూ గుర్తు చేసుకున్నారు. ఆయనకు తమతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్నారు. రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తో తమకు పెద్దగా అయ్యాక తెలిసిందన్నారు. వారిద్దరూ కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతుంటారని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.
వారి స్నేహం ఎప్పుడూ ఇలానే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. వారిద్దరూ కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికోసం మరొకరు నిలబడ్డారన్నారు. తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ ఎంత సాయం చేశారని గుర్తు చేశారు. సాధారణంగా రజనీకాంత్ తక్కువ నిడివి ఉన్న పాత్రలను చేయరని..కానీ తన తండ్రి కోసం పెదరాయుడు సినిమాలో నటించారని మంచులక్ష్మీ తెలిపారు.


