కాకతీయ, తెలంగాణ బ్యూరో: నటి మంచు లక్ష్మి, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎప్పటినుంచో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన దక్ష – ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండడంతో, ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఒక సీనియర్ సినీ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది.
ఇంటర్వ్యూలో జర్నలిస్టు.. “మీ వయసు 50 దాటబోతుంది.. ఈ వయసులో ఎందుకు ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. దీనిపై మంచు లక్ష్మి తీవ్రంగా స్పందిస్తూ, “ఇలాంటి ప్రశ్న అడిగే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మహేశ్ బాబుకి కూడా 50 ఏళ్లు వస్తున్నాయి. ఆయన షర్ట్ తీసి తిరుగుతున్నారు.. ఆయనను కూడా మీరు ప్రశ్నించగలరా? ఎందుకు ఒక మహిళకే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు?” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు మంచు లక్ష్మికి మద్దతుగా నిలబడ్డారు. “సరైన బుద్ధి చెప్పారు అక్కా” అంటూ ఆమెను అభినందించారు. అయితే ఈ ఘటనను అక్కడితో ముగించకుండా, మంచు లక్ష్మి తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌కు అధికారిక ఫిర్యాదు చేశారు.
తన ఫిర్యాదులో ఆమె పేర్కొంటూ .. “నాలుగేళ్ల తర్వాత నా తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించే ఒక ప్రాజెక్ట్‌ను నేను ప్రొడ్యూస్ చేశాను. కానీ ఆ ఇంటర్వ్యూలో నా సినిమా గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. బదులుగా, నా వయసు, శరీరం, దుస్తులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది జర్నలిజం కాదు.. కేవలం వైరల్ కావాలనే ప్రయత్నం మాత్రమే. మగవారి ఆధిక్యం ఉన్న ఈ పరిశ్రమలో నేను సాధించిన స్థాయి పట్ల నాకు గర్వం ఉంది. కానీ ఇలాంటి ప్రవర్తనను మౌనంగా వదిలేస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అందుకే వీఎస్ఎన్ మూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని స్పష్టంచేశారు.
ఈ సంఘటన ఫిల్మ్ నగరంలో పెద్ద చర్చకు దారి తీసింది. జర్నలిజం పరిమితులు, మహిళలపై చూపాల్సిన గౌరవం, సినీ పరిశ్రమలో నైతిక విలువలు వంటి అంశాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.


