బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి
కాకతీయ, కరీంనగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం బుధవారం (మార్చి 11) ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో మిట్టపల్లి వెంకటస్వామి తీగల గుట్టపల్లి నుంచి జూపిటర్ మోటార్ సైకిల్‌పై కరీంనగర్ వైపు వస్తున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన హోండా షైన్ మోటార్ సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తి అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి వెంకటస్వామి వాహనాన్ని ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో వెంకటస్వామికి తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని కరీంనగర్‌లోని ఒమేగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకటస్వామి కుమారుడు మిట్టపల్లి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన హోండా షైన్ వాహనం డ్రైవర్ చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన సింగసాని రాజకుమార్‌గా గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


