వ్యవసాయ భూమిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
తలకు తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం గుర్తింపు
కుటుంబ కలహాల కోణంలో పోలీసుల దర్యాప్తు
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. మృతుడి తలకు తీవ్ర గాయాలతో మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లింబాద్రి (51) మృతిచెందిన వ్యక్తిగా గుర్తించారు. గ్రామ శివారులోని బాశెట్టి గణేష్ వ్యవసాయ భూమిలో లింబాద్రి మృతదేహం బోర్లబొక్కలో పడి ఉండగా, సమీప రహదారి వద్ద అతని ద్విచక్ర వాహనం కనిపించింది. అధిక రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

భార్యతో గొడవ జరిగినట్లు సమాచారం
లింబాద్రి శనివారం రాత్రి భార్య, పిల్లలను కలవడానికి ఎర్దండి గ్రామానికి వచ్చి గొడవ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాల కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


