అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాకతీయ, గీసుగొండ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్లలో చోటు చేసుకుంది. గీసుగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెళ్ల రాజు అలియాస్ లవ్ రాజు (46) అనే వ్యక్తి మొగిలిచర్ల గ్రామ పరిధిలోని శ్మశాన వాటిక పక్కన చెరువు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న సిఐ విశ్వేశ్వర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పథకం ప్రకారం హత్య చేశారా? లేక సహజ మరణమేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జాగిలాలు, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళతో అక్రమ సంబంధమే మృతికి కారణమై ఉంటుందని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి గతంలో గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని గుండెపోటుతో మరణించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


