ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి…
భర్త మృతి, భార్యకు గాయాలు
కాకతీయ, దుగ్గొండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన దుగ్గొండి మండలం గిర్నిబావి- నర్సంపేట ప్రధాన రహదారిలో ఉన్న వినాయక మిల్లు వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిజి తండాకు చెందిన లూనావత్ రాజేందర్ తన భార్యతో కలసి పని నిమిత్తం నర్సంపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో వినాయక మిల్లు వద్ద అతని ముందు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా మిల్లు వైపు వెళ్ళుటకు రోడ్డు క్రాస్ చేయగా అట్టి వాహనానికి రాజేందర్ బైక్ తగిలి అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజేందర్ కు బలమైన గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య రజితకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సంపేట మార్చురికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రణధీర్ తెలిపారు.


