ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
రోడ్డు దాటుతుండగా ప్రమాదం
లారీ వదిలి డ్రైవర్ పరారీ
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కోరుట్ల బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఇసుక లారీ ఢీకొట్టడం ఈ విషాదానికి కారణమైంది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డుపై రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా అదే దారిలో వస్తున్న ఇసుక లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


