- రూ.6 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ నగరంలోని కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను శనివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ.6 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేయూసీ సీఐ ఎస్. రవి కుమార్ వివరాల ప్రకారం.. సెండే అరుణ్ కుమార్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేందుకు 2024లో హనుమకొండకు వచ్చాడు. చదువుతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. గోపాలపూర్, భీమారం ప్రాంతాల్లో రాత్రిపూట తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దోచుకున్నాడు. ఇప్పటి వరకు సుమారు 10 దొంగతనం కేసుల్లో పాల్గొన్నట్టు విచారణలో వెల్లడైంది. పోలీసులు అతని వద్ద నుండి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.56,400 నగదు, మొత్తం రూ.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారని సీఐ తెలిపారు. ఈ కేసును చేధించిన కేయూసీ ఎస్‌ఐలు పి. శ్రీకాంత్, కె. నవీస్ కుమార్, క్రైమ్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్ అలాగే సహకరించిన సీసీఎస్ వరంగల్ సిబ్బంది టి.మధు, బి.చందును సీఐ అభినందించారు.


