అట్టహాసంగా మల్లంపల్లి గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
సర్పంచ్‌గా ల్యాద శ్యామ్‌రావు బాధ్యతల స్వీకారం
ఉప సర్పంచ్‌గా కంచం సురేష్ ఎన్నిక
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘన కార్యక్రమం
అభివృద్ధే లక్ష్యంగా నూతన పాలకవర్గ హామీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన జెడి మల్లంపల్లి మండల కేంద్రంలో గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికైన ల్యాద శ్యామ్‌రావు, ఉప సర్పంచ్‌గా కంచం సురేష్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మల్లంపల్లి ఎంపీడీవో ఎం.డి. రహీముద్దీన్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు నూతన వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గాన్ని ఘనంగా అభినందించారు.
అభివృద్ధే ధ్యేయంగా పాలన
ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ ల్యాద శ్యామ్‌రావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన మల్లంపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన మండల కేంద్రంగా అవతరించిన మల్లంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో అవసరమైన నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో పరిపాలన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నూతన పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో పాటు శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేపడతామన్నారు. అదేవిధంగా గ్రామంలో దేవాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజలతో కలిసి పరిష్కరించే విధంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.


