రెండేళ్లుగా మల్లంపల్లి మండలం కాగితాల మీదే
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా మల్లంపల్లి మండలాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకాంక్ష, స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కేసీఆర్ ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది అని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు గడిచినా ఈ మండలం ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నది అని, మండల నిర్మాణంలో తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఇన్చార్జ్ ఎమ్మార్వో ఉన్నాడు అని,రిజిస్ట్రేషన్ కూడా ములుగు మీదే జరుగుతోంది అని,
పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాలేదు అని అన్నారు. మండలం ఉన్నా, సేవలు లేవు అని, ప్రజలు రోజూ ములుగుకే వెళ్లాల్సి వస్తోంది అని, ఇది ప్రజలను మోసం చేయడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేవ్‌నగర్–మల్లంపల్లి రెండు మాత్రమే సెంటర్లు ఉండటంతో మహమ్మద్ గౌస్‌పల్లి వంటి గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే అవసరమైన సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి, జిల్లా కలెక్టర్‌లను కోరారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అని, 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి అమలు చేయకముందే ఎన్నికలకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గంపై కుట్ర చేస్తోంది అని ఆరోపించారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చిన పార్టీ అని, గత జడ్పీ ఎన్నికల్లో జనరల్ సీటులో బీసీ నాయకుడు కుసుమ జగదీష్ ని చైర్మన్‌గా చేశింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుందనే భ్రమలో పడొద్దు అని, ఇక్కడ రెండు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మెడికల్ కాలేజ్‌ను ములుగుకు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని, కనెక్టివిటీ రోడ్లు, పర్యాటక అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయి అని అన్నారు. పాము కాటుకు గురైన ఏడేళ్ల బాలుడికి యాంటీవెనం ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇది ఎంత దారుణం? మంత్రి ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన డయాలసిస్ యూనిట్లు, మొబైల్ హెల్త్ సపోర్ట్ ఇంకా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదర్ల సంతోష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, మాజీ సర్పంచ్ చంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.


