మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం
పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్గిరి: మల్కాజ్‌గిరి అభివృద్ధి దిశగా కోర్టు భవన సముదాయం పనులకు మరో ముందడుగు పడింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి పనుల పురోగతిపై వినతి పత్రం సమర్పించారు. సుమారు తొంభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కోర్టుల సముదాయం పనులు ఇంకా పూర్తి స్థాయికి రాలేదని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం పనులు కొంతవరకు మాత్రమే సాగుతున్నాయని, పెండింగ్ బిల్లుల కారణంగా నిర్మాణం నిలిచే పరిస్థితి ఉందని తెలిపారు. బిల్లులుగా ఉన్న మొత్తం వెంటనే విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అవసరమైన చర్యలు తీసుకుని పనులు కొనసాగించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో కోర్టు భవన నిర్మాణానికి త్వరలోనే ఊపు వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.


