వాగులో గుడుంబా తయారీ
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో అక్రమ గుడుంబా తయారీ కొత్త రూపం దాల్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాగు మధ్యలో గుంతలు తవ్వి ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, వాగులో నీటి మధ్య గుంతలు తవ్వి వాటిలోనే గుడుంబా తయారీ జరుగుతుండడంతో బయటకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని, అందువల్ల ఈ అక్రమాన్ని గుర్తించడం అధికారులకు కష్టమవుతోందని తెలిపారు. ఈ కొత్త పద్ధతితో గుట్టుచప్పుడు కాకుండా తయారీ కొనసాగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్న ఇటుక ప్లాంట్‌ను ముసుగుగా ఉపయోగిస్తూ బయటకు వ్యాపారం జరుగుతున్నట్లు చూపించి, లోపల గుడుంబా తయారీ సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్రమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని వారు అంటున్నారు.

ఈ విషయంపై పలుమార్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. అక్రమంగా తయారవుతున్న గుడుంబా వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందని, విషపూరిత మద్యం సేవించడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి చూపు సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే దర్యాప్తు చేసి అక్రమ గుడుంబా తయారీని పూర్తిగా అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.



