మహాసభలను జయప్రదం చేయండి
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత కందగట్ల సురేందర్ పిలుపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి మహాసభకు నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 5న ఖమ్మం పట్టణంలోని జూబ్లీ క్లబ్లో నిర్వహించనున్న జాతీయ సదస్సును విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం–ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1917 అక్టోబర్ విప్లవం ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకమైందని పేర్కొన్నారు. దాని ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్ట్ ఆలోచనలు బలపడ్డాయని తెలిపారు. తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాల్లో అమరులైన వీరులకు విప్లవ జోహార్లు అర్పించారు. 1944–51 మధ్య సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. గత 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు ఏ.సాంబ, మలుగూరి సుగుణ, గణేష్, పీడీఎస్యూ జిల్లా నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.


