- విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
- మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు నిరంతరం గస్తీ
- కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకొని, కరీంనగర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మత్తు పదార్థాల దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖలు కలిసి పాఠశాలల పరిసరాలు, పాన్ షాపులు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిత్యం గమనించాలని కోరారు.
అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఉపన్యాసాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ… మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్ళు, కార్గో, పార్సిల్, ఆన్లైన్ గోదాములపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, డీడబ్ల్యుఓ సరస్వతి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.007


