ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం
ఐదు ఫైర్ టెండర్లతో మంటలు అదుపు
కీలక రికార్డుల భద్రతపై ఆందోళన
ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
షార్ట్ సర్క్యూట్ కారణమేనని అనుమానం
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) కార్యాలయంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన న్యాయసంబంధ ఆధారాలు భద్రపరిచే ఈ కార్యాలయంలో మంటలు చెలరేగడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఉదయం సుమారు 10:21 గంటలకు అగ్నిమాపక శాఖకు ప్రమాద సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అసెంబ్లీ, సెక్రటేరియట్, గాంధీ అవుట్‌పోస్ట్, సికింద్రాబాద్, లంగర్ హౌస్ ప్రాంతాల నుంచి ఐదు అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలానికి పంపించారు. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం సంభవించిన వెంటనే కార్యాలయంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు వెల్లడించారు. దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినా, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ విభాగంలో మంటలు మొదలైనట్లు సమాచారం. అక్కడ ఉన్న విద్యుత్ పరికరాల వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అనేక కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు, రసాయన నమూనాలు, నివేదికలు భద్రపరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం కారణంగా ఏవైనా ముఖ్యమైన ఫైళ్లు, ఆధారాలు దెబ్బతిన్నాయా అన్న కోణంలో అధికారులు సమగ్రంగా పరిశీలన చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, మంటలు మరింత విస్తరించకుండా కట్టడి చేశామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు కారణాలు వెలికితీయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


