ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత
15 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో అగ్రనేత పతిరాం మాంఝీ
ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్‌గా కీలక బాధ్యతలు
అతడిపై ఆరు రాష్ట్రాల్లో కేసులు.. రూ. 5 కోట్ల రివార్డు
అధికారికంగా ధృవీకరించని పోలీసులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఝార్ఖండ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ పితిరం మాంఝీ అలియాస్ అనల్ ఉన్నట్లు సమాచారం. అతనిపై ఆరు రాష్ట్రాలలో కేసులు, మొత్తం రూ. 5 కోట్ల రివార్డు కూడా ఉంది. కొన్నేళ్లుగా భద్రతా బలగాలపై దాడులకు ఇతడే పథకం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇక సింగ్భూం జిల్లాలో ఇంకా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆ ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ మావోలకు అతి పెద్ద దెబ్బ అని.. ఝార్ఖండ్‌లో నక్సలిజంపై భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయం అని అభివర్ణిస్తున్నారు.

ముంచుకొస్తున్న డెడ్‌లైన్
2026 మార్చి నాటికి మావోయిస్టు రహితంగా దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్దఎత్తున సెర్చింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల వివరాలు, ఆయుధాలు గురించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం అయితే పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కూడా కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఆపరేషన్ కగర్‌తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో అగ్రనేతలు హతంకాగా.. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసులకు ఎదుట లొంగిపోతున్నారు.


