అల్ఫోర్స్ లో మహాశివరాత్రి వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో పాఠశాలలో ముందస్తు మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి భావంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శివుడిని ఆరాధించిన వారికి సకల శుభాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఏమీ ఆశించని మహాదేవున్ని నిత్యం భక్తితో కొలిచిన వారికి ప్రతి కార్యంలో విజయం సిద్ధిస్తుందని తెలిపారు.
శివపార్వతుల వివాహ దినంగా కూడా మహాశివరాత్రిని పరిగణిస్తారని వివరించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ముఖ్యంగా శివతాండవం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


