రాజన్న గుట్టలో మహాశివరాత్రి ఉత్సవాలు
కాకతీయుల కాలం నాటి ప్రాచీన క్షేత్రానికి భక్తుల వెల్లువ
గుట్టపైకి కాలినడకన చేరుకొని స్వామి దర్శనం
కాకతీయ,ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శాపల్లి గ్రామ పరిధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం “రెండవ వేములవాడ”గా ప్రసిద్ధి చెందింది. స్థానికుల సమాచారం మేరకు క్రీస్తుశకం 1300 ప్రాంతంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైందని చెబుతున్నారు. అభయారణ్య ప్రాంతంలోని గుట్టపై కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గుట్టపైకి కాలినడకన చేరుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ చైర్మన్ మాదరి రాజు, కోశాధికారి మాదరి రాంబాబు, కమిటీ సభ్యుల సమక్షంలో శివకళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీతో రాజన్న గుట్ట పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోయాయి.


