మాధన్నపేట రోడ్డుకు మహర్దశ
ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం
వార్డుల వారీగా అభివృద్ధి పనులు
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పనుల్లో వేగం పెంచిన ఎమ్మెల్యే
పేటలో అభివృద్ధికి వరుస శంకుస్థాపనలు
కాకతీయ, నర్సంపేట : పట్టణంలో అభివృద్ధి పనులకు ఊపొస్తోంది. నర్సంపేట పోలీస్ స్టేషన్ నుంచి నాగుర్లపల్లి మీదుగా మాదన్నపేట వరకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొత్తగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల కోడ్‌కు ముందే పనులు
మున్సిపల్ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ శంకుస్థాపనలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.మాధన్నపేటలో పది లక్షల రూపాయల వ్యయంతో మున్నుకాపు సంఘం భవనం నిర్మాణానికి, అలాగే మూడో, ఇరవై ఐదో, ఇరవై ఏడో వార్డుల్లో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండెం రామానంద్, తోకల శ్రీనివాస్ రెడ్డి, బండి రమేష్, బానోతు లక్ష్మణ్ నాయక్, బైరి మురళి, యువ నాయకులు తుమలపల్లి సందీప్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


