లక్కు కిక్కెవరికో?
రేపే మద్యం షాపులకు లక్కీడ్రా
కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ
మొత్తం 2,620 షాపులకు 95 వేలకుపైగా అప్లికేషన్లు
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఫుల్ డిమాండ్
అత్యధికంగా శంషాబాద్‌లో 100 వైన్స్‌లకు 8,536 ..
అత్యల్పంగా వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 దరఖాస్తులు
రాష్టవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నూతన మద్యంపాలసీ 2025-27 సంవత్సరాలకు సంబంధించి లక్కీడ్రా సోమవారం తీయనున్నారు. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలు నిర్వహించే అవకాశం ఎవరికి దక్కనుందో వెల్లడికానుంది. జిల్లాలవారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు విజేతలను ప్రకటించనున్నారు. మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా.. వనపర్తిలో 34 వైన్స్‌లకు అత్యల్పంగా 757 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ..
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మద్యం దుకాణాలకు డిమాండ్ భారీగా ఉంది. శంషాబాద్‌లో అత్యధికంగా 100 దుకాణాలకు 8, 536 దరఖాస్తులు.. సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7845 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. అదేవిధంగా జిల్లాల వారీగా చూస్తే తక్కువ సంఖ్యలో షాపులు ఉన్న జిల్లాల్లో సైతం అప్లికేషన్ల జోరు తగ్గలేదు. మహబూబాబాద్ జిల్లాలో 59 వైన్స్‌లకు 1800 దరఖాస్తులు, భూపాలపల్లిలో 60 వైన్స్‌లకు 1863 వికారాబాద్ లో 59 వైన్స్లకు 1808 దరఖాస్తులు దాఖలయ్యాయి. తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 36 దుకాణాలకు 774, ఆదిలాబాద్‌లో 40 షాపులకు 771, వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 అప్లికేషన్లు వచ్చాయి.
సెప్టెంబరు 25న నోటిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.. గత సెప్టెంబరు 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరసటి రోజు నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. గతంలో మద్యం షాపుల దరఖాస్తులకు సంబంధించి.. దాదాపు 1.32 లక్షల అప్లికేషన్ల విక్రయం ద్వారా ఎక్సైజ్ శాఖకు దాదాపు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి మాత్రం దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపులకు ఈసారి కేవలం 95,436 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మద్యం దుకాణాల అప్లికేషన్ల విక్రయం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినా.. దరఖాస్తు రుసుమును పెంచడంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరింది. గతంలో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు.
95 వేల పైచిలుకు దరఖాస్తులు
ఈసారి ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఎక్కువ సంఖ్యలో జనాలు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈనెల 18 అర్ధరాత్రి వరకు 89,344 మంది దరఖాస్తు చేశారు. అయితే అదే రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో పలువురు వ్యాపారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నెల 23 వరకు గడువు పొడిగించింది. దీంతో 95 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈనెల అనగా అక్టోబర్ 27న డ్రా తీసి వ్యాపారులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి.
శంషాబాద్ ఎక్సైజ్ డివిజన్ టాప్
ఈసారి ఒక్కో అప్లికేషన్‌కు రూ.3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రిఫండబుల్. అలానే 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31 లక్షలుకాగా ఈసారి దాదాపు అదేస్థాయిలో అప్లికేషన్లు తగ్గాయి. ఫీజు రూ.3 లక్షలు చేయడంతో ఈసారి అప్లికేషన్లు తగ్గినా ఆదాయం క్రితంసారి వచ్చిందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 36 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.


