ప్రేమ వివాహం విషాదాంతం
అత్తింటి వేధింపులతో భార్య ఆత్మహత్య
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి
ఒకే వారంలో దంపతుల మృతి, రెండు కుటుంబాల్లో విషాదం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల విషాదాంతం హృదయ విదారకంగా మారింది. అత్తింటి వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గోదావరిఖని గంగానగర్‌కు చెందిన కంబాల నరేష్, మమత (29) మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమత తన బంధువుల వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో నరేష్ అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. భర్త చికిత్సలో ఉండగా అత్తింటి వారి మాటలతో మనస్తాపానికి గురైన మమత తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఆత్మహత్య చేసుకుంది.
పోలీసుల దర్యాప్తు కొనసాగింపు
మమత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్న నరేష్ కూడా మృతి చెందాడు. 14 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు సంతానం లేదు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


