ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!
అదనపు కట్నం కాటుకు యువతి బలి
తాండూరులో దారుణం… భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన అనుష
కాకతీయ, వికారాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న యువతి వరకట్న వేధింపులకు బలై ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనం సృష్టించింది. అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్త చివరకు ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… తాండూరులోని సాయుపూర్‌కు చెందిన పరమేశ్‌తో అనుష (22)కు ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అనుష భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. అయితే కొద్ది రోజులుగా అదనపు వరకట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల క్రితం భర్త పరమేశ్ ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లి, సోదరుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. గురువారం పుట్టింటికి వెళ్తుండగా పరమేశ్ బలవంతంగా అనుషను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో మరోసారి గొడవ జరగగా, ఆగ్రహానికి గురైన పరమేశ్ అనుషను తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరకట్న వేధింపులే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో తాండూరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.


