కట్న దాహానికి బలైన ప్రేమ వివాహం
అత్తింటి వేధింపులకు వివాహిత బలవన్మరణం
పెళ్లైన నెలలోనే వేధింపుల ప్రారంభం
లక్ష రూపాయలు ఇచ్చినా తగ్గని చిత్రహింసలు
ఆసుపత్రిలోనూ అవమానాలు.. మనస్తాపం
సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన మమత
భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు
కాకతీయ, కరీంనగర్ : కట్న వేధింపులు తట్టుకోలేక ప్రేమ వివాహం చేసుకున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో పాటు అత్తింటి సభ్యులు నిరంతరం కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత చివరకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
పెళ్లైన నెలలోనే కట్న వేధింపులు
కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29) తన బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్‌ను సుమారు 14 నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉన్న ఈ దంపతులు అనంతరం గంగానగర్‌లో అద్దె ఇంటికి మారారు.
ప్రేమ వివాహం జరిగిన నెల రోజులకే భర్త నరేష్‌తో పాటు అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం మమతను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేధింపులు అధికమవడంతో మమత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో రెండు నెలల క్రితం ఆమె సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆసుపత్రిలోనూ తప్పని అవమానాలు
ఈ నెల 16న మమత తన సోదరుడు మహేష్‌కు ఫోన్ చేసి అత్తింటి వారు తీవ్రంగా వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని తెలిపింది. అనంతరం కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తరలించారు. అయితే భర్త నరేష్ అనారోగ్యంతో ఇంటి వద్ద పడిపోవడంతో మమత అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా అత్తింటి సభ్యులు “నీ వల్లే మా కొడుకు పరిస్థితి ఇలా అయింది” అంటూ మమతను తీవ్రంగా అవమానించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత మంగళవారం ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లింది.
సోదరుడికి ఫోన్ చేసి ప్రాణాలు తీసుకున్న వివాహిత
మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత తన సోదరుడు మహేష్‌కు ఫోన్ చేసి అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానని, తాను ప్రాణాలు తీసుకుంటున్నానని తెలిపింది. వెంటనే మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మమత ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి తీగలగుట్టపల్లిలోని హనుమాన్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సరికి మమత ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు
మృతురాలి తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్‌తో పాటు అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవితపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రేమ వివాహం కట్న వేధింపులతో విషాదాంతానికి దారితీసిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.


