లారీ ఢీ.. యువకుడు అక్కడికక్కడే మృతి
పెద్ద నాగారం స్టేజ్ వద్ద అర్ధరాత్రి ప్రమాదం
మరిపెడ మున్సిపాలిటీ వాసిగా గుర్తింపు
తొర్రూరు నుంచి తిరిగొస్తుండగా విషాదం
కాకతీయ, మరిపెడ : నరసింహులపేట మండలం పెద్ద నాగారం స్టేజ్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరిపెడ మున్సిపాలిటీకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం–వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై వెనుక నుంచి లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీకి చెందిన బానోతు సంతోష్ (32) శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం తొర్రూరు పట్టణ కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద నాగారం స్టేజ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ అతడి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే నరసింహులపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


