పవర్ పేరుతో దోపిడి..!
ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం
నార్మల్ లేదంటూ బలవంతంగా పవర్ పెట్రోల్ అమ్మకాలు
లీటర్‌కు రూ.10 అదనపు భారం.. అన్ని బంకుల్లో ఒకే తంతు
వాహనదారులపై ఆర్థిక భారం.. పర్యవేక్షణలో పౌరసరఫరాల శాఖ వైఫల్యం
తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో పెట్రోల్ బంకుల దందా బహిర్గతమవుతోంది. నార్మల్ పెట్రోల్ లేదని చెప్పి పవర్ పెట్రోల్‌ను బలవంతంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ పెట్రోల్ బంక్ యజమానులు సిండికేట్‌గా మారి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని అనేక బంకుల్లో నార్మల్ పెట్రోల్ అందుబాటులో లేదని చెప్పి, పవర్ పెట్రోల్ మాత్రమే ఉందని వాహనదారులకు తెలియజేస్తున్నారు. దీంతో వినియోగదారులు వెనుదిరగలేని పరిస్థితుల్లో అధిక ధరతో పవర్ పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. లీటర్‌కు సుమారు రూ.10 వరకు అదనంగా చెల్లించాల్సి రావడం సామాన్య ప్రజలపై భారం పెంచుతోంది.

అన్ని బంకుల్లో ఒకే విధానం
ఒకటి రెండు బంకుల్లో మాత్రమే కాదు, నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పాండురంగపురం ప్రాంతంలోని హెచ్‌పీ, భారత్ బంకుల్లో కూడా ఇదే విధంగా పవర్ పెట్రోల్ విక్రయం జరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, బంక్ యజమానుల మధ్య అవగాహనతోనే ఈ విధానం అమలవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటమే కాకుండా, కొన్ని సందర్భాల్లో మైలేజ్ కూడా తగ్గుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా పవర్ పెట్రోల్ పోయించుకోవాల్సి రావడం వల్ల రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నార్మల్ పెట్రోల్ సరఫరా లోపం కంటే, ఉద్దేశపూర్వకంగా స్టాక్ లేకుండా చేసి పవర్ పెట్రోల్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా దిగుమతులు చేయకపోవడం కూడా దీనికి కారణమని భావిస్తున్నారు.
పర్యవేక్షణలో విఫలమైన యంత్రాంగం
ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నగరంలోని అన్ని బంకుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు జరిగినా అవి కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్టాక్ రికార్డులు మాత్రమే చూసి వాస్తవ పరిస్థితిని పట్టించుకోకపోవడం వల్ల ఈ దందా కొనసాగుతోందని అంటున్నారు. అన్ని బంకుల్లో ఒకే విధంగా నార్మల్ పెట్రోల్ లేకపోవడం, పవర్ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండటం వెనుక సిండికేట్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు బంక్ యజమానులు పరస్పరం అంగీకరించి ఈ విధానం అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తక్షణ చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత పరిస్థితులపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, నార్మల్ పెట్రోల్ స్టాక్ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దోపిడీకి పాల్పడుతున్న బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం నగరంలో పెట్రోల్ విక్రయాల పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారం వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


