ఎసరు ఎదురు చూపు!
రేషన్ షాపుల్లో మూలుగుతున్న వరద బాధితుల బియ్యం
రెండు నెలలకు గానీ విడుదల కాని ఆహార సాయం
15 రోజులైనా పంపిణీకి నోచుకోని బియ్యం
ముహూర్తం కోసం వేచిచూస్తున్నామంటున్న అధికారులు
ఎమ్మెల్యేలు కరుణించే వరకు ఎసరు మరగాల్సిందేనా?
కాకతీయ, వరంగల్ : రెండు నెలల క్రితం వరంగల్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పలువురు సర్వస్వం కోల్పోయిన సంగతి విదితమే. కొన్నిచోట్ల ఇంట్లో సామగ్రి కూడా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. వరద తగ్గుముఖం పట్టాక ఎప్పటిలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. పరామర్శించారు. ముఖ్యమంత్రి సైతం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా, వరద బాధితులకు బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆ బియ్యం ఇప్పుడు రేషన్ షాపుల్లో మూలుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15రోజులుగా ఆ బియ్యం ఎసరు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు కరుణిస్తేనే!
వరంగల్, ఖిల్లా వరంగల్ మండల పరిధిలలో వరద బాధితులకు మంజూరైన బియ్యం రేషన్ షాపులకు చేరాయి. వరంగల్ లోని పైడిపల్లి పరిధిలో 21 కుటుంబాలు.. 61 మందికి మనిషికి ఆరు కిలోల చొప్పున 366 కిలోలు, ఏనుమాముల పరిధిలో 81 కుటుంబాలు.. 243 మందికి 1458 కిలోలు, గిర్మాజీపేట పరిధిలో 101 కుటుంబాలు.. 286మందికి 1716 కిలోలు, రామన్నపేట పరిధిలో 1415 కుటుంబాలు.. 4317 మందికి 25902 కిలోలు కాగా వరంగల్ మండల పరిధిలో మొత్తంగా 1620 కుటుంబాల్లో 4907 మందికి గాను 29442 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. అలాగే ఖిల్లా వరంగల్ మండల పరిధిలో 1417 కుటుంబాలల్లో 4630 మందికి ఆరు కిలోల చొప్పున 27780 కిలోల బియ్యాన్ని డిసెంబర్ 5న ఆయా రేషన్ డీలర్లకు విడుదలయ్యాయి. వీటిని పంపిణీ చేసేందుకు ఒక్కో ఏరియాకు అధికారులను కూడా నియమించారు. ఏయే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలో కూడా నివేదిక సిద్ధం చేశారు. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఈ బియ్యం పంపిణీకి ఎమ్మెల్యేల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల చేతులమీదుగా పంపిణీ చేయాలని, వారి కోసమే ఎదురుచూస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి..!
వరదల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారికి తక్షణ సాయం కింద ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి.. వరదలు వచ్చి రెండు నెలలకు గానీ సర్కారు కళ్లు తెరవలేదు. దానికి కూడా ఎమ్మెల్యేల రూపంలో పంపిణీకి ఆటంకాలు ఏర్పడడం ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే పాలకుల తీరు హాస్యాస్పదం అనిపిస్తోంది. ఇప్పటికే బియ్యం డీలర్ల వద్దకు చేరకుని 15రోజులు దాటుతోంది. మరి ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేమని అధికారులు పేర్కొనడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు లేదా మంత్రి స్పందించి.. వారున్నా లేకపోయినా.. బియ్యం పంపిణీకి అనుమతిస్తారని ఆశిద్దాం! లేదంటే.. మతిలేనోడు దుకాణం పోతే.. ఇంట్లో ఎసరు మరిగి ఆవిరైనట్లుగా ఉంటుంది.. వరద బాధితుల బియ్యం పంపిణీ!


