కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో నూతన గృహ నిర్మాణ పనులను చేపడుతున్న ఇంటి యజమానులు, బిల్డర్లు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, టైల్స్, మార్బుల్ పనులకు స్థానిక యూనియన్ కార్మికులనే నియమించుకోవాలని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం, సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి రవి కోరారు.
సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానికేతర కార్మికులు తక్కువ ధరకు పని చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ, వారి పని నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నాసిరకం పనుల వల్ల ఇంటి యజమానులకు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని, పని మధ్యలో వదిలి వెళ్లిపోవడం, సమస్యలు తలెత్తినప్పుడు అందుబాటులో లేకుండా పోవడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
స్థానిక యూనియన్‌లో సభ్యులుగా ఉన్న కార్మికులను నియమించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, స్థానిక కార్మికులు తాము చేసే పనికి పూర్తి బాధ్యత తీసుకుంటారన్నారు. భవిష్యత్తులో సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు. ఈ పద్ధతి ద్వారా ఇంటి యజమానులు సుదీర్ఘకాలం పాటు భరోసా పొందవచ్చని, నాణ్యమైన పనికి హామీ లభిస్తుందని పేర్కొన్నారు. పని కోసం పెదపల్లికి వచ్చే ఇతర ప్రాంతాల కార్మికులు సైతం స్థానిక యూనియన్‌లో చేరి సహకరించాలని అసోసియేషన్ నాయకులు తెలిపారు.
దీనివల్ల కార్మికులందరికీ ఒక వేదిక ఏర్పడుతుందని, పని నాణ్యత, పారదర్శకత మెరుగుపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.vఈ నిర్ణయం ద్వారా స్థానిక వృత్తులకు మద్దతు లభిస్తుందని, సమాజంలో సౌభ్రాతృత్వం కూడా పెంపొందుతుందని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోశాధికారి గడ్డం తిరుమల్, ప్రచార కార్యదర్శి మిరినల రవీందర్ రావు, ఉప్పు వెంకటేశ్వర్లు, భరణి రమేష్, గడ్డం శేఖర్, ఇరువురాళ్ల అంజి, కొండి సురేష్, తదితరులు పాల్గొన్నారు.


