- పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలకు నిధులు
ఎమ్మెల్యేకు ఫండ్స్ లేవు, పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదు
పంచాయతీలకు బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంతా కాదు
ప్రతి ఇంటికీ 3 సార్లు వెళ్లి ప్రచారం చేయండి
కాషాయ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు నుండి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్ గా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా నాయకులకు పతారా ఉంటుందని, తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వారిని గెలిపించేందుకు అన్ని విధాలా క్రుషి చేస్తానన్నారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ఇంచార్జీలు గంగిడి మనోహర్ రెడ్డి, శాంతికుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికలకు సమాయత్తం కావాలి
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సర్వేలు అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, స్థానిక ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. టిక్కెట్ల ఎంపికలో రాష్ట్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని, నేను అభిప్రాయం చెప్పొచ్చు కానీ, అది ఫైనల్ కాదని గెలుపు సాధ్యమయ్యే అభ్యర్థులనే పార్టీ ప్రకటిస్తుందని బండి స్పష్టం చేశారు. నామినేషన్లు వేసేందుకు నేతలు కావలసిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాకు గ్రూపులు లేవు, నాది బీజేపీ గ్రూపే పార్టీ అని అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అని వ్యాఖ్యానించిన బండి సంజయ్, పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఏకైక ఎంపీగా నేనే ..
ప్రతి గ్రామానికి రూ.5 నుండి రూ.20 లక్షల వరకు నిధులు విడుదల చేసిన ఏకైక ఎంపీగా నేనే అని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్, జాతీయ ఉపాధి హామీ పథకాల కింద కేంద్ర నిధులతోనే రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బండి సంజయ్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నయాపైసా నిధి లేదని, బీఆర్ఎస్ పల్లెలకు చేసిన మోసాలు మరువలేమని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేశారన్నారు. అటువంటి పార్టీకి ఓటేసిన ప్రజలకు ఏమి ప్రయోజనం?” అని బండి ప్రశ్నించారు.
ప్రచారానికి పూర్తి సమయం కేటాయిస్తా.
ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు రెట్టింపు శ్రమ చేయాలి. నేను కూడా పూర్తిగా ప్రచారానికి సమయం కేటాయిస్తాను అని కార్యకర్తలను బండి సంజయ్ తెలిపారు. ప్రతి ఇంటికీ కనీసం మూడు సార్లు వెళ్లి బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రజలను కోరాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విరక్తి పెరిగిందని, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని సంజయ్ సూచించారు.


