స్థానిక ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ బలాన్ని చాటాయి
పోలీసుల బెదిరింపుల మధ్యలోనూ గులాబీ జెండా విజయం
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేవరుప్పుల మండలంలో నూతన సర్పంచులకు సన్మానం
కాకతీయ, దేవరుప్పుల : అధికార మదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచులు ధైర్యంగా నిలబడి విజయం సాధించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలంలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు నూతన సర్పంచులను ఆయన శాలువాలతో సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 61 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో 30 శాతానికి పడిపోవడం ప్రజల తీర్పేనని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 31 శాతం ఓట్లు పొందిన బీఆర్ఎస్, సర్పంచ్ ఎన్నికల్లో 60 శాతం ఓట్లు సాధించి పూర్వవైభవాన్ని చాటిందన్నారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్ఎస్ వైపే నిలిచాయని ఈ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు.
డబ్బు, బెదిరింపులు పనిచేయలేదు
డబ్బు సంచులు, బెదిరింపులతో ఎన్నికలు నిర్వహించినా ప్రజలు మాత్రం గులాబీ జెండాకే మద్దతిచ్చారని తెలిపారు. నామినేషన్ల దశ నుంచే కార్యకర్తలను భయపెట్టినా పార్టీని వదలలేదన్నారు. ఈ గెలుపు బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, కేసీఆర్ హయాంలో అమలైన పథకాలకు కోతలు పెట్టిందని విమర్శించారు. ఈ మోసాన్ని ప్రజలు గుర్తించి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని అన్నారు.
భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ ముందంజ
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకరించకపోయినా ధైర్యంగా పనిచేయాలని, పార్టీతో పాటు కేసీఆర్, తాను అండగా ఉంటామని నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.


