చట్నీలో బల్లి… ఎనిమిది మందికి అస్వస్థత
జగిత్యాల జిల్లా కేంద్రం హోటల్‌లో ఘటన
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్‌లో శుక్రవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. అక్కడ టిఫిన్లు తిన్న ఎనిమిది మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్లకు వడ్డించిన చట్నీలో బల్లి పడినట్లు బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. టిఫిన్ తీసుకున్న కొద్దిసేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైద్యులు బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. అయితే ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో పట్టణంలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టిఫిన్ సెంటర్‌లో పరిశుభ్రత లోపించిందని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత టిఫిన్ సెంటర్‌పై ఆహార భద్రతా శాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


