తుఫాన్ బాధితులకు అండగా ‘లయన్స్’
కాకతీయ, ములుగు ప్రతినిధి : అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేయూతగా నిలిచింది. లయన్స్ ఇంటర్నేషనల్ 320-ఫ్ డిస్టిక్ గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య చేతుల మీదుగా సాయం అందజేశారు. ములుగు మండలంలోని వెంకటాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారు 200 నిరుపేద కుటుంబాలకు ఫ్లడ్ రిలీఫ్ కిట్స్, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు ఉమెన్ ఓరియెంటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించాయి. ప్రతి కిట్‌లో దాదాపు 13 రకాల అవసరమైన వస్తువులు, అలాగే ఒక బ్లాంకెట్ ను అందించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న డిస్టిక్ గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ అవసరార్థులను ఆదుకోవడంలో ముందుంటుందన్నారు. సహాయం చేయడం ద్వారా మనం సమాజానికి తిరిగి ఇవ్వగలుగుతాం అని తెలిపారు. అలాగే ములుగు లయన్స్ క్లబ్ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్ మెడికల్ షాప్ అనేక మంది పేద ప్రజలకు తక్కువ ధరలో ఔషధాలను అందిస్తూ నిజమైన సేవా భావాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వి డిజి హరి కిషన్ రెడ్డి, డిసి ఎస్‌ఆర్ ప్రకాశం, డిసిటి సి హెచ్ రఘునాథరెడ్డి, డిస్టిక్ చీఫ్ సెక్రటరీ (సర్వీస్ మార్గం) ప్రభాకర్, డిసిసి జి సురేష్ కుమార్, జిఎస్టి రేవూరి రమణారెడ్డి, ఆర్‌సి రాజేందర్, తిరుపతి, లయన్స్ క్లబ్ ములుగు సెక్రటరీ లయన్ చుంచు రమేష్, ట్రెజరర్ ఆడెపు రాజు, అలాగే లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాన్యం పాల్గొన్నారు.


