కల్యాణ లక్ష్మితో పేదింట్లో వెలుగులు
ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శనివారం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆమె కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, సంక్షేమ–అభివృద్ధి పథకాలతో దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడారు.
పారదర్శకంగా సంక్షేమ అమలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నామని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ఆర్థిక సహాయం అందుతోందని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని పారిజాత, ఉపసర్పంచ్ వినోద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


