ఉచిత విద్యుత్‌తో పేదింట్లో వెలుగులు
గృహజ్యోతి పథకంతో ఆర్థిక ఊరట
అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ. సోములు
కాకతీయ, మరిపెడ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకం పేదింట్లో ఆనందాలు నింపుతోందని అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ. సోములు అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు వినియోగించుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కు నేతృత్వంలో పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.
82 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల 62 వేల 498 కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,593 కోట్లను సబ్సిడీగా నేరుగా చెల్లించిందన్నారు. గతంలో కరెంట్ బిల్లులు చెల్లించలేక పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ చెల్లించడం ద్వారా లబ్ధిదారులకు పెద్ద ఊరట కలిగిందని సర్పంచ్ బోడ. సోములు తెలిపారు. గృహజ్యోతి పథకాన్ని ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం వల్ల పేదల జీవన ప్రమాణం మెరుగుపడుతోందని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎస్.కే. షరీఫ్, కారోబార్ అలవాల యాదగిరి, వివో అధ్యక్షురాలు ఎస్.కే. చాందిని, ఎలక్ట్రిసిటీ లైన్‌మన్ భాస్కర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.


