ఇంటింటికి సోలార్‌తో పేదలకు వెలుగు
పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ మహేశ్వరి రాజు
కాకతీయ, ఆత్మకూరు : పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారుల ఇళ్లకు ఉచిత సోలార్ పరికరాల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు మండలంలో మొత్తం రెండు వేల గృహాలకు సోలార్ సదుపాయం కల్పించే లక్ష్యంతో చర్యలు చేపట్టామని చెప్పారు. మొదటి విడతగా రెండు వందల అరవై గృహాలను ఎంపిక చేసి సోలార్ పరికరాల ఏర్పాటు ప్రారంభించామని వెల్లడించారు.
సోలార్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవడంతో పాటు, మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్, వార్డు సభ్యులు బయ్య కుమారస్వామి, లబ్ధిదారులు పాల్గొన్నారు.


