ఢిల్లీ కాలుష్యంపై కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ
11 ఏళ్లుగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోలేదని విమర్శ
కాకతీయ, నేషనల్ డెస్క్ : రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యానికి కారణం గత ఆప్ ప్రభుత్వమేనంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. 15 పేజీల ఈ లేఖలో గత 11 ఏళ్లుగా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ధూళి ఉద్గారాల నియంత్రణపై అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ఇది ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా మారిందని ఎల్జీ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానాలు, కార్యాచరణలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అయితే, ఎల్జీ ఆరోపణలను ఆప్ ఖండించింది. కాలుష్య సమస్యపై చర్చించాలనే ఆసక్తి ఎల్జీకి లేదని, ప్రస్తుత ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో విఫలమై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ లేఖ వ్యవహారం సాగుతోందని ఆప్ మీడియా సలహాదారు అనురాగ్ ధండా విమర్శించారు. రాజధానిలో కాలుష్య పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్న తరుణంలో రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణపై బాధ్యత ఎవరిది అన్న అంశంపై వాదోపవాదాలు ముదిరుతున్నాయి.


