కాకతీయ, గీసుగొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ మాత్రమే కాదు; ప్రకృతిని పూజించే మనసు, స్త్రీ శక్తిని గౌరవించే ఆచారం, సమాజ సమైక్యతను కాపాడే సాంప్రదాయం.
మన పక్క రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్టాపనతో జరుపు కుంటారు. ప్రతిరోజూ అమ్మవారికి విభిన్న రూపాల్లో అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ ప్రత్యేకత వేరే. ఇక్కడ తొమ్మిది రోజులు .. తొమ్మిది రకాల బతుకమ్మలు పేర్చుతారు. సహజ పూలతో అలంకరించి, జానపద గీతాలతో, మహిళల సమైక్యతతో, గ్రామీణ ఆనందోత్సవంగా పండుగను జరుపుకోవడం మన సంప్రదాయం. ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటే విలువైన ఆచారం.
ఉద్యమంలో బతుకమ్మ ఆత్మ :
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినప్పుడు మన భిన్నత, మన ప్రత్యేకతే ప్రధాన వాదన. మన సంస్కృతి, పండుగలు, యాస,జీవన విధానం పక్క రాష్ట్రాల కంటే వేరని నిరూపించడానికి బతుకమ్మ ఒక ప్రతీకగా నిలిచింది. ఉద్యమ సమయంలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కవిత్వంలోనూ, పాటలలోనూ,సభలలోనూ బతుకమ్మను తెలంగాణ ఆత్మగౌరవ జెండాగా ఎగురవేశారు.
మార్పు ముసుగులో ముప్పు:
కానీ నేటి కాలంలో వాడవాడనా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి విగ్రహ ఆరాధన వైపు మళ్లించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇది మన సంప్రదాయాన్ని వక్రీకరించే మార్గం.
బతుకమ్మ అంటే – విగ్రహం కాదు, పూల సమాహారం.
బతుకమ్మ అంటే – ప్రదర్శన కాదు, జానపద ఆత్మబలం.
మన బాధ్యత:
చిన్నారులకు బతుకమ్మలోని సారాన్ని అర్థం చేయాలి. సహజ పూలతోనే బతుకమ్మలు నిర్మించి ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందించాలి.కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు కలిసి పండుగను జరుపుకోవాలి.జానపద గీతాలు, ఆటలు, పాటలతో బతుకమ్మను సామూహిక ఆనందోత్సవంగా నిలపాలి. ముఖ్యంగా ఉద్యమ ఆత్మను మరిచిపోకుండా బతుకమ్మను తెలంగాణ గౌరవ చిహ్నంగా కాపాడాలి. బతుకమ్మను బతికిస్తేనే మన సంస్కృతి బతుకుతుంది.సంస్కృతి బతికితేనే మన అస్తిత్వం నిలుస్తుంది.


