మేడారం జాతరను విజయవంతం చేద్దాం
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్
కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే జనవరి 28న ప్రారంభమై 31 వరకు జరగనున్న మహా మేడారం జాతరను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున మరింత పురోగతిశీల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోటి 50 లక్షల మందికిపైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10 వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. అమ్మవార్ల గద్దల వద్ద మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.జాతరలో భక్తుల సౌకాల్యం కోసం ఈసారి అదనంగా 5 కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేసి మొత్తం 8 క్యూ లైన్ల ద్వారా దర్శనాన్ని నిర్వహిస్తామని, మూడు గేట్ల ద్వారా బయటికు పంపిణీ చేస్తామని వివరించారు. గత రెండు జాతరాల్లో వచ్చిన అనుభవంతో ఈసారి మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణపై భక్తులకు మైక్ అనౌన్స్‌మెంట్లు, ప్రచార వాహనాలు, నినాదాల ద్వారా అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయిని అరికట్టేందుకు నిఘా..!
జిల్లా పరిధిలో గంజాయి విక్రయాలు, చెడు వ్యసనాలు, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. చెడు వ్యసనాలపై కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు. అలాగే అక్రమ ఇసుక, ఎర్ర మట్టి రవాణాపై కఠినంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై పశువులు తిరగకుండా ముందస్తుగా యజమానులకు నోటీసులు జారీ చేసి, వినని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే కార్మికులు, వ్యక్తుల వివరాలను సేకరించడం ద్వారా అనుకోని సంఘటనలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుల కోసం జాతరలో ప్రత్యేక వాహనాలు, గుర్తింపు కార్డులు వంటి సౌకర్యాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. సమస్యలను ప్రజలకు తెలియజేసే క్రమంలో పాత్రికేయులు సూచనలు, సలహాలు ఇవ్వాలని, చిన్న సమస్యలను భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదని చెప్పారు.



