- ఆదివాసి హక్కులకు పోరాడుదాం
- ‘చలో ఏటూరు నాగారం’ జయప్రదం చేయాలి
- ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూనెం శ్రీనివాస్
కాకతీయ,బయ్యారం : తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జాక్) రాష్ట్ర చైర్మన్ పూనెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కొమరంభీం విగ్రహం వద్ద ‘చలో ఏటూరు నాగారం ఐటీడీఏ ముట్టడి’ కరపత్రంను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి వలసదారులను తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలుగా చెప్పుకుంటున్న లంబాడీలు 1971 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు 12778, అనంతపూర్ 43345, కడప 7874, చిత్తూరు 11515 , శ్రీకాకుళం ఒక్కరు మాత్రమే ఉన్నారని తెలిపారు. నిజాం పరిపాలనలోని ఎస్టీ లుగా ఉన్నామని చెప్తున్న లంబాడీ లు 1971 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా ఎస్టీలుగా లేరని నొక్కొ చెప్పారు. వారు ఎక్కడ నుంచి వలస వచ్చారో బీరాలు పలికే లంబాడీ నాయకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 1976 తరువాత తెలంగాణా రాష్ట్రం లో ఎస్టీ రిజర్వేషన్ పేరుతో ఉపాధ్యాయ, తదితర ఉద్యోగాల్లో 75 శాతం అక్రమంగా పొందారని ఆరోపించారు.
యే శాఖలో చూసినా డీఎస్పీలు, సీఐలు, కానిస్టేబుళ్లుగా వారే తమ ఉద్యోగాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేగాక అనేక ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులు పొందుతూ ఆదివాసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. 1976లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు సామాజిక స్పృహతో న్యాయంగా వ్యవహరించి ,లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించదని చెప్పిన సంగతి గుర్తు చేశారు. ప్రస్తుత అధికారులు లంబాడీలకే మద్దతుగా నిలుస్తూ తమను నిర్లక్ష్యంతో అడవులకే పరిమితం చేసి మనుగడ ప్రశ్నార్థకం చేయ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగి ఆదివాసీ హక్కులను సాధించుకునే విధంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాక్ గౌరవ సలహాదారుడు రమణాల లక్ష్మయ్య, బయ్యారం మండల జాక్ చైర్మన్ వర్స ప్రకాష్, వైస్ చైర్మన్ అలెం కృష్ణ, కమిటీ సభ్యులు చీమల శివకుమార్, ఇర్ప రాజేష్, కోటెం పుల్లయ్య, వట్టం శ్రీను, ఇర్ప రామారావు, తాటి లక్ష్మీనారాయణ, పుల్సం రమేష్, చింత భార్గవ్, చాట్ల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


